–ఎన్నికల హామీని అమలు చేస్తూ సీఎం 34 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ పై కృతజ్ఞతలు
–ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యుడు బేపారి జాకీర్
సలాం ప్రొద్దుటూరు:
బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, రాష్ట్రానికి బ్యాక్‌బోన్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశారని ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యుడు బేపారి జాకీర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని ప్రతిపక్ష వైసీపీ వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడం గమనించాల్సిన విషయమన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
సమగ్ర అధ్యయనం తర్వాతే 34 శాతం రిజర్వేషన్లు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకోలేదని జాకీర్ స్పష్టం చేశారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, కచ్చితమైన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఇందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, సమగ్ర సర్వేలు నిర్వహించిన అనంతరం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బీసీల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.
బీసీలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయి
34 శాతం రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు లభిస్తాయని జాకీర్ అన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగడంతో వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.అదేవిధంగా రిజర్వేషన్లలో మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా బీసీ మహిళలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో కుట్రపూరిత ప్రచారం
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు సోషల్ మీడియాలో వివిధ రకాల ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని జాకీర్ ఆరోపించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గమనించాలని కోరారు.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా బేపారి జాకీర్ కృతజ్ఞతలు తెలిపారు.
“బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్. వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు తీసుకున్న 34 శాతం రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని జాకీర్ పేర్కొన్నారు.
