
–ఆధార్ లేని 12 ఏళ్ల బాలికకు అధికారుల సమన్వయంతో ప్రత్యేక సహాయం
–పద్మకు ఆధార్ నమోదు..
–సదరం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా తదుపరి చర్యలు
–ఎమ్మెల్యే , మున్సిపల్ కమిషనర్ ను కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, ప్రాంతవాసులు
సలాం ప్రొద్దుటూరు:
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే స్పందిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరోసారి తన మానవీయతను చాటుకున్నారు. ఏడేళ్లుగా ఆధార్ కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన 12 ఏళ్ల బాలిక కుటుంబ సమస్యను గుర్తించి, అధికారులతో సమన్వయం చేసి ఆధార్ నమోదు చేయించడంతో పాటు పింఛన్ తదితర సంక్షేమ ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టారు.మోడంపల్లి 16వ వార్డులో నివాసం ఉంటున్న రామలక్ష్మి, రామాంజనేయులు దంపతుల కుమార్తె పుట్లూరు పద్మ (12) చిన్ననాటి నుంచే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమై ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా ఉండటంతో తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాడుగ ఇంట్లో జీవిస్తున్న ఈ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇంటింటి పర్యటనలో వెలుగులోకి వచ్చిన సమస్య
ఇటీవల ఇంటింటి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పద్మ కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలికకు ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందడం లేదని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. బాలికకు ఆధార్ నమోదు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పురపాలక కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు సూచించారు. అవసరమైతే స్వయంగా తన కారులో బాలికను తీసుకెళ్లి ఆధార్ నమోదు చేయిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఇంటికి వెళ్లి సమస్యను పరిశీలించిన కమిషనర్
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సిబ్బందితో కలిసి పద్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాలికకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందాల్సిన సేవలు కూడా సక్రమంగా అందడం లేదని గుర్తించారు. వెంటనే సంబంధిత అంగన్‌వాడీ టీచర్‌ను పిలిపించి పద్మను అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించారు.
ప్రత్యేక అనుమతులతో నాలుగు గంటలపాటు ఆధార్ ప్రక్రియ
పద్మకు ఆధార్ లేకపోవడంతో సెలవు రోజైన రెండో శనివారం కూడా నమోదు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక అనుమతులు పొందారు. జిల్లా కోఆర్డినేటర్ నవీన్‌తో సంప్రదించిన కమిషనర్, రాష్ట్రస్థాయి UIDAI కోఆర్డినేటర్ జావీద్‌తో మాట్లాడి బాలిక ప్రత్యేక పరిస్థితిని వివరించి ఆధార్ నమోదుకు అనుమతి పొందారు.అనంతరం పద్మ కుటుంబ సభ్యులను కమిషనర్ స్వయంగా తన వాహనంలో ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లారు. బాలిక ఆరోగ్య పరిస్థితి కారణంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫొటో నమోదు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిబ్బందికి ధైర్యం చెప్పి, ప్రక్రియ పూర్తయ్యే వరకు కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సుమారు నాలుగు గంటలపాటు సిబ్బంది శ్రమించడంతో చివరకు పద్మ ఆధార్ నమోదు విజయవంతమైంది.
పింఛన్ కోసం తదుపరి చర్యలు
ఆధార్ నమోదు పూర్తయిన అనంతరం కూడా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమస్యను అక్కడితో ముగించలేదు. బాలికకు సదరం నమోదు చేయించి, అర్హత మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.ఏడేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం చూపడంతో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని గుర్తించి అండగా నిలిచిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజా సంక్షేమంలో మానవీయ కోణం కీలకం”
కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారులకు, సిబ్బందికి మానవీయ కోణంతో పనిచేసే దృక్పథం ఉంటే ప్రభుత్వ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రొద్దుటూరు పురపాలక సంఘం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజా సమస్యను ఇంటింటి పర్యటనలో గుర్తించి.. అధికార యంత్రాంగాన్ని కదిలించి.. పరిష్కారం లభించే వరకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చూపిన చొరవ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

