–బీసీలను అణగదొక్కే ధోరణిని సహించం.. రాబోయే చైర్మన్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరులో బీసీలను గౌరవిస్తూ వారికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జాబివుల్లా అన్నారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని ఆయన సూచించారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన చల్ల రాజగోపాల్ పై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిసి నేతల సమావేశంలో జరిగింది.ఈ సందర్భంగా హాజరై ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో హత్యలు ఉండవని, అయితే రాజకీయ పరిణామాలు, ప్రజల తీర్పు ద్వారా రాజకీయంగా వ్యక్తులకు సమాధానం లభిస్తుందని వ్యాఖ్యానించారు. బీసీలకు సంబంధించిన గత పరిణామాలను ఆ వర్గాల ప్రజలు మరచిపోలేదని అన్నారు. బీసీ సంఘాలు గతంలో భయపడిన పరిస్థితులు ఉన్నప్పటికీ, 2024 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు తమ తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు.
బీసీ నాయకుడు రమేష్ యాదవ్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని జాబివుల్లా ఆరోపించారు. చైర్మన్ ఎన్నికల్లో ఆయన తన సొంత డబ్బుతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ, అనంతరం చైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, అయినప్పటికీ ప్రొద్దుటూరులో ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
అదేవిధంగా నందం సుబ్బయ్య హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులకు శిక్ష పడే వరకు బీసీలు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని జాబివుల్లా అన్నారు. ఎన్నికల్లో బీసీలకు సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
చల్లా రాజగోపాల్ యాదవ్ ప్రతి నెలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజగోపాల్ యాదవ్ ఎమ్మెల్యే చెవిలో ఏం చెప్పారనే అంశాన్ని పక్కనపెట్టి, ఆయనపై చేసిన వ్యాఖ్యలను మాత్రమే పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
“ఎమ్మెల్యే వరదకు సూటిగా మాట్లాడినందుకు ఒక బీసీ నాయకుడి నాలుక కోస్తామని వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు” అని జాబివుల్లా అన్నారు. ఇదే అంశంపై ప్రవీణ్ రెడ్డి కూడా మరుసటి రోజు స్పందించారని, అయితే ఆయనపై మాత్రం అదే విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
బీసీ నాయకుడు మాట్లాడినందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే బీసీలు ఎదగకూడదనే ధోరణి కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. బీసీ నాయకుల పట్ల వివక్ష చూపే రాజకీయ విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
రాబోయే చైర్మన్ ఎన్నికల్లో బీసీల రాజకీయ చైతన్యం ఏమిటో తెలుస్తుందని జాబివుల్లా అన్నారు. బీసీల్లో చైతన్యం పెరుగుతున్నందుకు తాను సంతోషిస్తున్నానని, ప్రజలే సరైన సమయంలో తగిన రాజకీయ సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో బీసీల పట్ల మమకారం, ప్రేమ లేకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీలను గౌరవించేది, వారికి అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని జాబివుల్లా స్పష్టం చేశారు.
చల్లా రాజగోపాల్ యాదవ్‌కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బహిరంగంగా మద్దతుగా నిలిచారని, అలాగే ప్రవీణ్ రెడ్డి కూడా తన మద్దతు తెలిపారని ఆయన గుర్తుచేశారు. రాబోయే చైర్మన్ ఎన్నికల్లో బీసీలు తమ గళాన్ని బలంగా వినిపిస్తారని, చైర్మన్ సీటును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని జాబివుల్లా ధీమా వ్యక్తం చేశారు.
