సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని, అయితే ప్రొద్దుటూరులో మాత్రం ఇందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. బీసీలను కించపరిచేలా, భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ నేత చల్లాల రాజగోపాల్ యాదవ్ పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యల పై బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదన్నారు. రాజగోపాల్ యాదవ్ చెప్పని మాటలను కూడా ఆయనకు ఆపాదిస్తూ బీసీలను చులకనగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.
పార్టీలు వేర్వేరుగా ఉండొచ్చని, నాయకులు ఎవరైనా కావొచ్చని, అయితే రాజకీయ విభేదాల పేరుతో ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని పుల్లయ్య అన్నారు. “నరికేస్తాం.. కోస్తాం.. తంతాం” వంటి భయపెట్టే వ్యాఖ్యలు చేస్తే బీసీలు భయపడి పడి ఉంటారనే భావనను పక్కన పెట్టాలని సూచించారు.
గతంలో కూడా బీసీలపై ఇలాంటి వ్యాఖ్యలు, వివక్షకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బచ్చల పుల్లయ్య తెలిపారు. ఇదే విధమైన ధోరణి కొనసాగితే బీసీలంతా ఏకతాటిపైకి వస్తే రాజకీయంగా ఎలాంటి ఫలితం వస్తుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రొద్దుటూరులో మంచి రాజకీయ వాతావరణం నెలకొల్పి, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కోరారు.
