–“బీసీలంటే నాకు గౌరవం.. వ్యక్తిగత ఆరోపణలకు మాత్రమే నా స్పందన”
–తనకు కులమతాల కంటే మానవత్వమే ముఖ్యం
–“జగన్, వైసీపీ, కార్యకర్తలే నా బలం.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని వరదరాజులరెడ్డికి సవాల్”
సలాం ప్రొద్దుటూరు:
తాను బీసీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు మొత్తం చల్లా రాజగోపాల్ యాదవ్‌ను ఉద్దేశించినవేనని, వాటిని బీసీ సమాజానికి ఆపాదించడం రాజకీయంగా తనపై బురదజల్లే ప్రయత్నమని ఆయన అన్నారు.మంగళవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ.. “బీసీలంటే నాకు గౌరవం. బీసీ వర్గాన్ని ఉద్దేశించి నేను ఎలాంటి అవమానకర వ్యాఖ్య చేయలేదు. రాజగోపాల్ యాదవ్ వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు మాత్రమే నేను స్పందించాను” అని స్పష్టం చేశారు.రాజగోపాల్ యాదవ్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. అదే వ్యాఖ్యను ఒక బీసీయేతర వ్యక్తి చేసినా, ఒక ఎస్సీ, ఎస్టీ లేదా ఓసీ వ్యక్తి చేసినా తన స్పందన ఇదే విధంగా ఉండేదని రాచమల్లు పేర్కొన్నారు.
“ఒక వ్యక్తి తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. నేను స్పందించింది కులాన్ని బట్టి కాదు.. వ్యక్తి చేసిన ఆరోపణలను బట్టి” అని ఆయన వివరించారు.తనకు బీసీ వర్గాలపై అపారమైన గౌరవం ఉందని, తన రాజకీయ జీవితంలో బీసీ నాయకులు, కార్యకర్తలకు అనేక అవకాశాలు కల్పించానని రాచమల్లు తెలిపారు. తనతో పాటు సమావేశంలో ఉన్న పలువురు బీసీ నాయకులకు కూడా ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ అంశాన్ని కుల రాజకీయంగా మార్చి బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. “నా వ్యాఖ్యలను బీసీ సమాజానికి వ్యతిరేకంగా చిత్రీకరించడం రాజకీయ ఎత్తుగడ. బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి” అని అన్నారు.కులాల పేరుతో ప్రజలను విభజించడం తన రాజకీయ విధానం కాదని, అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవిస్తానని రాచమల్లు స్పష్టం చేశారు. తనకు కులమతాల కంటే మానవత్వమే ముఖ్యమని పేర్కొన్నారు.బీసీలను అవమానించారనే ఆరోపణలతో తనపై రాజకీయంగా దాడి చేయడం కాకుండా, తాను చేసిన అసలు వ్యాఖ్య ఏ సందర్భంలో, ఎవరిని ఉద్దేశించి చేశాననే విషయాన్ని ప్రజలకు వివరించాలని రాచమల్లు ప్రత్యర్థులకు సూచించారు.తన వ్యాఖ్యలను వక్రీకరించి బీసీలకు, తనకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
“రాజకీయ ప్రత్యర్థులు వేరు.. శత్రుత్వం వేరు”
టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనకు రాజకీయ ప్రత్యర్థులని, అయితే వరదరాజులరెడ్డి, కొండారెడ్డిలను మాత్రం రాజకీయ శత్రువులుగా భావిస్తున్నానని రాచమల్లు వ్యాఖ్యానించారు. రాజకీయ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కొనసాగుతుందని తెలిపారు.సమావేశంలో మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, వైసీపీ బీసీ నాయకులు భీమునిపల్లె నాగరాజు, సుబ్బయ్య, పన్నీటి కాశయ్య, యాలం శంకర్, గోపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
మున్సిపల్ ఎన్నికలపైనా సవాల్
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ పరిస్థితులకు అనుగుణంగా పోటీ విషయంలోనూ తాను సిద్ధంగా ఉన్నానని రాచమల్లు తెలిపారు. ప్రత్యర్థి వర్గం నుంచి ఎవరిని బరిలోకి దింపినా ప్రజల తీర్పును స్వాగతిస్తానని అన్నారు.“ఎన్నికల్లో ప్రజలే నిర్ణేతలు. ఎవరి బలం ఎంతుందో బ్యాలెట్ ద్వారా తేలిపోతుంది” అని పేర్కొన్నారు.
“2029లో తేల్చుకుందాం”
“2029 ఎన్నికల్లో పార్టీలు లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం. ఎవరి బలం ఎంతుందో ప్రజలే నిర్ణయిస్తారు” అని రాచమల్లు అన్నారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తానని తెలిపారు.గతంలో తాను సాధించిన రాజకీయ విజయాలను ప్రస్తావిస్తూ, 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రొద్దుటూరు పట్టణంలోని పలు వార్డుల్లో తన అనుచరులను గెలిపించుకున్నానని పేర్కొన్నారు. అది తనకు ప్రజల్లో ఉన్న రాజకీయ బలానికి నిదర్శనమని అన్నారు.2024 ఎన్నికల్లో వరదరాజులరెడ్డి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన పరిస్థితులను కూడా రాచమల్లు ప్రస్తావించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవలేనని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి భావిస్తే, వచ్చే ఎన్నికల్లో పార్టీలు లేకుండా పోటీ చేసి తనను ఓడించాలని రాచమల్లు సవాల్ విసిరారు.
“జగన్ లేకుంటే రాచమల్లు జీరో అంటున్నారు.. అదే నా బలం”
తాను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ, కార్యకర్తల బలంతోనే రాజకీయాల్లో ఉన్నానని రాచమల్లు స్పష్టం చేశారు. జగన్ లేకుండా తాను సాధారణ వ్యక్తినేనని చెప్పడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
“నాకు పార్టీ టికెట్ ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే మరోలా ఉండే వ్యక్తిని కాదు. జగన్, వైసీపీ, కార్యకర్తలే నా బలం” అని పేర్కొన్నారు.

