–ట్రాఫిక్ చలాన్లతో పాటు రాజీ కాగల కేసుల పరిష్కారానికి చర్యలు
సలాం ప్రొద్దుటూరు – కడప:
సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. కడప న్యాయ సేవా సదన్‌లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామగోపాల్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నూతన ప్రధాన జిల్లా న్యాయమూర్తి జి. రామగోపాల్‌కు పుష్ప మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎ.ఎస్.పి., డి.ఎస్.పి.లతో లోక్ అదాలత్ నిర్వహణపై చర్చించారు.సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో చర్చించి రాజీ మార్గంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు W.P.No.116/2024, తేదీ 26-11-2025 ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను రాబోయే జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉందని సమావేశంలో వివరించారు. సంబంధిత పరిధిలోని జాతీయ లోక్ అదాలత్ బెంచ్‌లో చలాన్లను కాంపౌండ్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎ.ఎస్.పి., డి.ఎస్.పి.లు, న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

