–రాచమల్లు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటు కౌంటర్
–“ఉపాధి, అభివృద్ధిని అడ్డుకోవడమేనా మీ విధానం?”
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరులో కార్పొరేట్ సంస్థల రాకపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాచమల్లు హయాంలోనే పలు కార్పొరేట్ సంస్థలు పట్టణంలోకి వచ్చాయని, ఇప్పుడు అదే సంస్థలను రాజకీయంగా విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.శుక్రవారం నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, “మీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు అవకాశం ఇచ్చి.. ఇప్పుడు వాటి రాకనే తప్పుబట్టడం ఏమిటి?” అని రాచమల్లును ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందన్నారు.
కార్పొరేట్ల రాకతో ఉపాధి అవకాశాలు
ప్రొద్దుటూరులో ఇప్పటికే అనేక కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మరిన్ని సంస్థలు పట్టణానికి వస్తే పెట్టుబడులు పెరగడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రవాణా, సేవలు, చిన్న వ్యాపారాలు వంటి అనుబంధ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని, సంస్థల రాకను కేవలం రాజకీయ కోణంలో చూడటం సరికాదని వరదరాజులరెడ్డి అన్నారు.
“అభివృద్ధిని రాజకీయాలకు బలి చేయొద్దు”
ప్రొద్దుటూరును ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “ప్రజలకు ఉద్యోగాలు రావాలి.. పట్టణానికి పెట్టుబడులు రావాలి.. వ్యాపార అవకాశాలు పెరగాలి. దీనిని అడ్డుకునే రాజకీయాలు ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడవు” అని స్పష్టం చేశారు.గతంలో కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించి, ప్రస్తుతం వాటి రాకను వ్యతిరేకించడం వెనుక ఉన్న రాజకీయ కారణాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. విమర్శలు చేయడం కంటే స్థానిక యువతకు ఉపాధి, పట్టణానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలనే దానిపై దృష్టి పెట్టాలని రాచమల్లుకు సూచించారు.ప్రొద్దుటూరు అభివృద్ధిని అడ్డుకునే ఏ నిర్ణయానికీ తాము మద్దతు ఇవ్వబోమని, ఉపాధి కల్పించే సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్, ఘంటశాల వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, సుంకర మురళీ తదితరులు పాల్గొన్నారు.
