–28 ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల తనిఖీ..
–అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
–చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు– ASP విభుకృష్ణ
సలాం ప్రొద్దుటూరు:
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ IPS ఆదేశాల మేరకు, ASP విభుకృష్ణ IPS ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున పెన్నానగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉదయం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి. అనుమానితులు, షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వ్యక్తుల ఇళ్లను పోలీసులు గుర్తించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 28 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ASP విభుకృష్ణ తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పేకాట, బెట్టింగ్, రౌడీయిజం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, అందిన విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు ఎంతటి వారైనా వారి స్థాయి, హోదాతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
యువత మాదకద్రవ్యాలు, పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ASP సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారి స్నేహాలు, కార్యకలాపాలను గమనించాలని కోరారు.
సమాచారం ఇవ్వండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
“ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించడమే పోలీస్ శాఖ లక్ష్యం” అని ASP విభుకృష్ణ IPS స్పష్టం చేశారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ టి.వి. కొండారెడ్డి తదితరులు ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.


