ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కార్పొరేట్లకు రెడ్ కార్పెట్.. వ్యాపారులపై ఇప్పుడు ప్రేమా?

కార్పొరేట్లకు రెడ్ కార్పెట్.. వ్యాపారులపై ఇప్పుడు ప్రేమా?

📰 Generate e-Paper Clip

 

–రాచమల్లు హయాంలోనే రిలయన్స్, మాల్స్‌కు అనుమతులు.. పదేళ్లలో స్థానిక వ్యాపారుల కోసం ఏం చేశారు?

 

— కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా

 

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్థానిక వ్యాపారుల సమస్యలపై మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా తీవ్రంగా ప్రశ్నించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో స్థానిక వ్యాపారుల ప్రయోజనాల కోసం ఏమి చేశారో ముందుగా ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల రాకతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాచమల్లు మాట్లాడుతున్నారని, అయితే ఈ సమస్య కొత్తగా పుట్టుకొచ్చింది కాదని అన్నారు. 2014 నుంచి 2024 వరకు రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ప్రొద్దుటూరుకు పలు కార్పొరేట్ వ్యాపార సంస్థలు వచ్చాయని, కొన్ని సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు కూడా అదే సమయంలో మంజూరయ్యాయని ఆయన ఆరోపించారు.

 

రిలయన్స్‌ నుంచి డీ-మార్ట్‌ వరకు.. ప్రశ్నల వర్షం

 

రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్, బీ-మార్ట్, విశాల్ మార్ట్, సీఎంఆర్ షాపింగ్ మాల్, డీ-మార్ట్, చందనాస్ తదితర సంస్థలు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అప్పటి ఎమ్మెల్యేగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఇర్ఫాన్ బాషా ప్రశ్నించారు.“పచ్చారి వ్యాపారులపై నిజంగా ప్రేమ ఉంటే రిలయన్స్ మార్ట్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారు? వస్త్ర వ్యాపారుల అభివృద్ధి కోరుకుంటే సీఎంఆర్ మాల్‌కు ఎందుకు అనుమతులు ఇచ్చారు?” అని నిలదీశారు. స్థానిక వ్యాపారులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అప్పట్లో ప్రస్తావించినప్పుడు వారికి అండగా నిలిచారా? ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారా? అని ప్రశ్నించారు.

 

చేనేతలపై చిత్తశుద్ధి ఎక్కడ?

 

చేనేత కార్మికుల అభివృద్ధిపై కూడా ఇర్ఫాన్ బాషా ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పదవీకాలంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేశారా? దళారుల ప్రమేయాన్ని తగ్గించి, చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టారా? అని ప్రశ్నించారు.“చేనేతలపై నిజంగా ప్రేమ ఉంటే వారికి ప్రత్యేక మార్కెట్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు?” అని ఆయన నిలదీశారు.

 

కూరగాయల మార్కెట్‌పైనా విమర్శలు

 

పాత కూరగాయల మార్కెట్‌లో వందలాది మంది వ్యాపారులు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండేదని, మార్కెట్‌కు సంబంధించిన నిర్ణయాల వల్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. మార్కెట్ వ్యాపారుల ప్రయోజనాల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలపై రాచమల్లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“వ్యాపారులపై మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే కూరగాయల మార్కెట్ వ్యాపారులకు లక్షల్లో బండలు అమ్మి ఎందుకు అన్యాయం చేశారు?” అని ప్రశ్నించారు.

 

రూ.2,500 కోట్ల హామీపై లెక్క చెప్పాలి

 

ఎన్నికలకు ముందు ఐదేళ్లలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రూ.2,500 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని ఇచ్చిన హామీపై కూడా ప్రజలకు లెక్క చెప్పాలని ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకువచ్చిన నిధులు, పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాలను ప్రజల ముందుంచాలని అన్నారు.“డబ్బులు పంచకుండా, నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి అని ప్రజలను అడిగే ధైర్యం ఉందా?” అంటూ రాచమల్లుకు సవాల్ విసిరారు.

 

కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే వ్యాపారులకు అండగా ఉంటాం

 

స్థానిక వ్యాపారులు, చేనేత కార్మికుల ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఇర్ఫాన్ బాషా తెలిపారు. కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే స్థానిక సంస్థల కౌన్సిల్ నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తూ, కార్పొరేట్ సంస్థలకు అనుమతుల విషయంలో స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు.చేనేత కార్మికుల కోసం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసి, దళారుల ప్రమేయం లేకుండా వారు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల వేళ వ్యాపారుల సమస్యలను రాజకీయ అంశంగా కాకుండా, వారి జీవనోపాధి మరియు భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రస్తుతం వ్యాపారులపై మాట్లాడాలని ఆయన అన్నారు.“ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. ఎన్నికల వేళ మాటలకంటే గత పాలనలో చేసిన పనులే కొలమానం కావాలి” అని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!