ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్స్మార్ట్‌ పోలీసింగ్‌తో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి–ఎస్పీ

స్మార్ట్‌ పోలీసింగ్‌తో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి–ఎస్పీ

📰 Generate e-Paper Clip

 

–మట్కా, బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌పై ఉక్కుపాదం.. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి వేగం

 

–నేర సమీక్షలో పోలీస్‌ అధికారులకు ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ దిశానిర్దేశం

 

సలాం ప్రొద్దుటూరు –  కడప:

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఐపీఎస్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్‌డివిజన్ల పోలీస్‌ అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్‌ పోలీసింగ్‌ కింద అమలు చేస్తున్న CEIR, ఈ-సాక్ష్య, CCTNS, ఈ-సమ్మన్స్‌, ఈ-ప్రాసిక్యూషన్స్‌ తదితర మాడ్యూళ్ల పనితీరును సమీక్షించారు.రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని కొనసాగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ట్రబుల్‌ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ తదితర కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

 

స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళిక

 

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడినవారు, సమస్యలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించి ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని పెంచాలని సూచించారు.

 

సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి

 

సైబర్‌ నేరాల కేసుల దర్యాప్తు పురోగతిని ఎస్పీ సమీక్షించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, PGRS పరిధిలోని ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.డ్రోన్‌ కెమెరాల ద్వారా నిఘా పెంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, బహిరంగ మద్యపానం వంటి వాటిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సూచించారు.

 

దొంగతనాల నివారణకు మ్యాపింగ్‌

 

దొంగతనాల నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలను విశ్లేషించి మ్యాపింగ్‌ చేయాలని ఎస్పీ సూచించారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు.షాపులు, లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో ఏపీ పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.

 

రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. హెల్మెట్‌ ధరించడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓవర్‌ స్పీడ్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, వాహనాల రికార్డులు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

 

ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు రివార్డులు

 

ఇటీవల కీలక కేసులను ఛేదించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేశారు.రివార్డులు అందుకున్న వారిలో ఎర్రగుంట్ల ఎస్‌ఐ నాగమురళి, రాజుపాలెం ఎస్‌ఐ ప్రణయ్‌ కుమార్‌ రెడ్డి, లింగాల ఎస్‌ఐ జగదీశ్వర రెడ్డి, కమాండ్‌ కంట్రోల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ జాన్‌ (PC 3219), పులివెందుల పోలీస్‌ స్టేషన్‌ హోంగార్డు వి. రామాంజనేయులు (HG 2029) ఉన్నారు.సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె. ప్రకాష్‌ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విబు కృష్ణ ఐపీఎస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌, జమ్మలమడుగు డీఎస్పీ కె. వెంకటేశ్వరరావు, పులివెందుల డీఎస్పీ బి. మురళితో పాటు ఆయా సబ్‌డివిజన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!