
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండల పరిధిలోని యానాది కాలనీ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం–2ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి, కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు.హాస్టల్‌లో అసంపూర్తిగా ఉన్న గదులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చింతామణితో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని హాస్టల్ అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతలో లేదా వసతి సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం జరిగి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హాస్టల్ వార్డెన్‌ను హెచ్చరించారు.

