–నకిలీ బంగారు కడ్డీలు, ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం
–ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చాకచక్యం
సలాం ప్రొద్దుటూరు:
తక్కువ ధరకే ఎక్కువ బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు వసూలు చేసి నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి మోసానికి పాల్పడిన వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం.150/2026, సెక్షన్ 318(4) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఈ కేసు వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభు కృష్ణన్, ఐపీఎస్ వెల్లడించారు.
ప్రొద్దుటూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ బెల్లాల రవికుమార్ (44) తనకు పరిచయమైన వ్యక్తి ద్వారా తిరుపతి జిల్లా పుత్తూరు మండలం వినాయకపురానికి చెందిన కన్నయ్య అలియాస్ ప్రసాద్ అనే వ్యక్తిని కలిశాడు. ఆయుర్వేద చికిత్సతో పాటు తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం తయారు చేసి ఇస్తానని ముద్దాయి నమ్మించడంతో, 2025 డిసెంబర్ 7న రూ.5 లక్షలకు బంగారం తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. అనంతరం ఇతర ఖర్చుల పేరిట మరో రూ.1.50 లక్షలు చెల్లించడంతో మొత్తం రూ.6.50 లక్షలు ముద్దాయికి అందజేశాడు.20 నుంచి 40 రోజుల్లో బంగారం సిద్ధమవుతుందని చెప్పిన ముద్దాయి, అనంతరం పుత్తూరుకు రప్పించి బంగారు రంగులో ఉన్న కడ్డీలను అందజేశాడు. వాటిని పరీక్షించగా అవి నకిలీవని తేలింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా, మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని, లేదంటే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ జి. మధుసూదన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.విచారణలో భాగంగా ఆదివారం (జూలై 26) ఉదయం ప్రొద్దుటూరులోని యర్రగుంట్ల బైపాస్ రోడ్డులో వాసవి సర్కిల్ వద్ద నిందితుడు ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి బంగారు కోటింగ్‌తో ఉన్న నకిలీ బంగారు కడ్డీలు (సుమారు 100 గ్రాములు), ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన చెప్పారు.
