ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన వైఎస్‌ షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన వైఎస్‌ షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

📰 Generate e-Paper Clip

–ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం ఆగదు

– ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి

–చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఇర్ఫాన్‌ బాషా

 

సలాం ప్రొద్దుటూరు   –విజయవాడ:

ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిరసన తెలిపేందుకు ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో శనివారం    చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పేర్కొంటూ విజయవాడ లెనిన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభం కావాల్సిన మార్చ్‌కు పోలీసులు అనుమతించలేదు. గన్నవరం కేసరపల్లిలోని తన నివాసం నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు బయలుదేరిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డిని అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ ఇర్ఫాన్‌ బాషా పాల్గొన్నారు.

 

రాజ్యాంగ పుస్తకంతో షర్మిల నిరసన

 

పోలీసులు తనను అడ్డుకోవడంపై వైఎస్‌ షర్మిలా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమె, తన నివాసం ఎదుట రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి నిరసన చేపట్టారు. శాంతియుతంగా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలనుకుంటే అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, తమ వద్ద కత్తులు, కటార్లు, బాంబులు లేవని పేర్కొన్నారు. తనను హౌస్‌ అరెస్ట్‌ చేయించడం చంద్రబాబుకు న్యాయమా? అని ప్రశ్నించారు.

 

ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు

 

ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు అని షర్మిల పేర్కొన్నారు. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే, ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని, దేశవ్యాప్తంగా 13.40 కోట్ల ఓట్లు తొలగించారని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి 13 నుంచి 20 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించారని పేర్కొంటూ, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.దళితులు, పేదలు, ముస్లింలు, క్రైస్తవుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు. బతికి ఉన్నవారి ఓట్లను సైతం వారు మరణించినట్లుగా చూపించి తొలగించారని విమర్శించారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపునకు సంబంధించి రాహుల్‌ గాంధీ పలు అంశాలను వెలుగులోకి తెచ్చారని అన్నారు.

 

ఫారం 6, ఫారం 7 దుర్వినియోగం చేస్తున్నారని విమర్శ

 

ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం 6, ఫారం 7లను బీజేపీ తనకు అనుకూలంగా దుర్వినియోగం చేస్తోందని షర్మిల ఆరోపించారు. కర్ణాటకలో ఒక బీజేపీ కార్యకర్త 7 వేల ఓట్ల తొలగింపునకు పేర్లు నమోదు చేశారని పేర్కొన్నారు. ఓటరు ప్రమేయం లేకుండానే పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.ఫారం 7 వినియోగంపై నిరసనగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును కూడా ఆ ఫారంలో నమోదు చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. ఓటు తొలగింపుతో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో ఆయనకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు.

 

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు

 

ఎన్నికల సంఘం సహా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ ప్రధాని మోదీ నియంత్రణలో పనిచేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ నియామకాన్ని ఆమె తప్పుబట్టారు. 2023లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎంపికకు సంబంధించిన చట్టంలో మార్పులు చేసి, ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర క్యాబినెట్‌ మంత్రిని చేర్చారని విమర్శించారు. ఈ మార్పుల వల్ల ప్రతిపక్ష నేత ఆమోదం లేకుండానే అధికార పక్షానికి అనుకూలమైన వ్యక్తిని నియమించే అవకాశం ఏర్పడిందని ఆరోపించారు.జ్ఞానేశ్‌ కుమార్‌పై తమకు నమ్మకం లేదని, ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కొనసాగడం ప్రజాస్వామ్యానికి సురక్షితం కాదని షర్మిల వ్యాఖ్యానించారు.

 

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించే వరకు ఉద్యమం

 

ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!