–శాలువాతో సత్కరించి, ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు
సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైభవంగా నిర్వహించనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ కమిటీ నాయకులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా
ఆర్యవైశ్య సభ ప్రతినిధులు అందించిన ఆహ్వానాన్ని స్వీకరించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరులో నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులతో చర్చించారు.ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేక ప్రాశస్త్యం ఉందని పేర్కొన్న ఎంపీ, ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.
పాల్గొన్న ఆర్యవైశ్య సభ నాయకులు
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మల్లెంకొండు ప్రతాప్, కమిటీ సభ్యులు మల్లేముల సత్యం, బచ్చు పవన్ తదితరులు పాల్గొన్నారు.
