సలాం ప్రొద్దుటూరు – కడప:
రాయలసీమ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. అమరజీవి జలధార సభ విజయవంతం కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన తాగునీటి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు.
రాయలసీమలో పెట్టుబడులకు ప్రోత్సాహం
మిషన్ రాయలసీమ ద్వారా ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్‌ల అభివృద్ధితో పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. రాయలసీమలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని భూపేష్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్ల పాలనపై విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు సరికావని పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి విజయానికి కృషి చేస్తారని భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జయసుబ్బారెడ్డి, బొమ్మిశెట్టి చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్, మీడియా కోఆర్డినేటర్ జనార్దన్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
