సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలం లోని ఖాదర్బాద్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ సెంటర్‌ను ప్రకృతి వ్యవసాయ డిపీఎం ఎస్వీ ప్రవీణ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్‌లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.కిచెన్ గార్డెన్‌లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంతో పాటు సూర్యమండలం నమూనాను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన తాజా, నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలను పిల్లలకు అందించి, వారికి పోషకాహారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ప్రజలు, రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఎస్వీ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఘనజీవామృతం, జీవామృతం, వివిధ కషాయాలను ఉపయోగించి రసాయన రహితంగా పంటలను సాగు చేయాలని తెలిపారు.అదేవిధంగా ప్రతి ఇంటి వద్ద కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని, ఇంటి అవసరాలకు సరిపడే నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలను స్వయంగా పండించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ గ్రామాన రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వైపీ భరత్, ఎన్‌ఎఫ్‌ఏ నరసింహారెడ్డి, ఎఫ్‌ఎంటీ శ్యామ్‌సుందర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.

