–ఒకే ప్రాంగణంలో పాఠశాల, హాస్టల్ నిర్వహణ సరికాదు: ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు
సలాం ప్రొద్దుటూరు:
ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదులు, హాస్టల్ గదులను ఒకే ప్రాంగణంలో విద్యాసంస్థల యాజమాన్యాలు సొంతంగా నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు.ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, హాస్టల్ ఫీజు తదితరాల పేరుతో దాదాపు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యార్థులకు సరైన రక్షణ, భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. తగిన భద్రతా ప్రమాణాలు, అవసరమైన వసతులు కల్పించకుండా హాస్టళ్లను నిర్వహించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లపై సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర తనిఖీలు నిర్వహించాలని హరిబాబు డిమాండ్ చేశారు. హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంతో పాటు తగిన సిబ్బంది, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కల్పించే భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యార్థుల భద్రతకు ఎటువంటి ముప్పు కలగకుండా నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్టళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హరిబాబు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు దస్తగిరి, ఓబులేసు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
