–మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలు నిరాధారం: టీడీపీ సీనియర్ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డైరెక్టర్ ఈవీ సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సుచరిత పేరుతో బ్యాంకులో ఖాతా తెరిచి నగదు కాజేశారంటూ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను బ్యాంకు ఖాతాదారుడిగా, మాజీ డైరెక్టర్‌గా బ్యాంకు అభివృద్ధిని కోరుకుంటున్నానని తెలిపారు. బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు పరిణామాలకు ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డిని బాధ్యులను చేయడం సరికాదని ఆయన అన్నారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
