–పెద్దశెట్టిపల్లిలో నిమజ్జనానికి పురపాలక సంఘం విస్తృత ఏర్పాట్లు
సలాం ప్రొద్దుటూరు:
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో గణేష్ మహారాజ్ జైత్రయాత్ర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా బుధవారం ప్రారంభమైంది. జైత్రయాత్రలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పెద్దశెట్టిపల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పురపాలక అధికారులు తెలిపారు. గతంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు కుందూ నదిలోనూ విగ్రహాల నిమజ్జనం జరిగేది. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయనిక రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనంపై నిషేధం అమల్లో ఉండటంతో పెద్దశెట్టిపల్లి వద్ద ప్రత్యేక నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు.స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ సూచనలతో నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు.ఏర్పాట్లను మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజేష్, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది నూర్ బాషా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు.నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు, పురపాలక శాఖ అధికారులు సూచించే నిబంధనలు, భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
