–ఆధునిక ఇంజనీరింగ్‌లో ఏఐ, డిజిటలైజేషన్ కీలకం: ఎస్.కె. చాంద్ భాషా
సలాం ప్రొద్దుటూరు:
భారతరత్న, ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే వేడుకలను ప్రొద్దుటూరులోని ఎస్ఆర్‌ఐటీ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ముఖ్య అతిథులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ (APSPDCL) ప్రొద్దుటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.కె. చాంద్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొద్దుటూరు డీఈ ఎంఎస్ శిరీష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. జాన్సన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్.కె. చాంద్ భాషా మాట్లాడుతూ ఆధునిక ఇంజనీరింగ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగన్ రవి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఇంజనీరింగ్ రంగం ద్వారా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ప్రతిభకు వేదిక
ఇంజనీర్స్ డే సందర్భంగా బీటెక్ విద్యార్థులకు “ది రోల్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటలైజేషన్ ఇన్ మోడ్రన్ ఇంజనీరింగ్” అనే అంశంపై వ్యాసరచన పోటీ, “స్మార్ట్ ఇంజనీరింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్” అనే అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు, కళాశాల ప్రిన్సిపల్ బహుమతులను అందజేశారు. విజేతలను కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ వీర కళ్యాణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. వెంకటేశ్వర రెడ్డి అభినందించారు.కార్యక్రమంలో కళాశాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, సిబ్బంది, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు.

