
–నాటరాజ కళాక్షేత్రం విద్యార్థుల కూచిపూడి, జానపద నృత్యాలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సలాం ప్రొద్దుటూరు:
హౌసింగ్ బోర్డు కాలనీలో విజ్ఞ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన 5వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక సందడితో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటరాజ కళాక్షేత్రం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు ఆహుతులను అలరించాయి. చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో సంప్రదాయ కళల వైభవాన్ని చాటడంతో కార్యక్రమ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
కార్యక్రమానికి డా. వరుణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఉత్సవాల్లో ప్రత్యేకంగా సందడి చేశారు. ఈ సందర్భంగా నాటరాజ కళాక్షేత్రం నాట్యగురువు మొహియుద్దీన్ ఖాన్ను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తి, సంస్కృతి, కళలను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఉత్సవాలకు కాలనీ ప్రజలు, భక్తులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు.


