ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కమ్యూనిస్టు ఉద్యమం ప్రజలకు నిత్య అవసరం

కమ్యూనిస్టు ఉద్యమం ప్రజలకు నిత్య అవసరం

📰 Generate e-Paper Clip

–సామాజిక న్యాయం సోషలిజంతోనే సాధ్యం

–సీపీఎం సీనియర్ నాయకులు కందారపు మురళి

సలాం ప్రొద్దుటూరు –కడప:

సీతారాం ఏచూరి కమ్యూనిస్టు విలువలను చాటిచెప్పిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయాల సాధనకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం సీనియర్ నాయకులు కందారపు మురళి పేర్కొన్నారు. సామాజిక న్యాయం సోషలిస్టు విధానాల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.

కడపలోని స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో శనివారం సీపీఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జి. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు కందారపు మురళి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి 1974లో ఢిల్లీ యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐలో చేరి, 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారని తెలిపారు. అనంతరం జేఎన్‌యూలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి దేశవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఆకర్షించారని చెప్పారు.

1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఏచూరి, విద్యార్థులతో కలిసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నివాసాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారని మురళి గుర్తుచేశారు. ఆ పోరాటంతో యువ నాయకుడిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని అన్నారు.

దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులోనూ సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని చెప్పారు. నాటి కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, నేడు బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఐక్యత కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.

వామపక్ష ఉద్యమంలో రివిజనిజం, అతివాదం, అవకాశవాద ధోరణులకు వ్యతిరేకంగా ఏచూరి నిరంతరం పోరాడారని తెలిపారు. ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు కమ్యూనిస్టు ఉద్యమం అత్యవసరమని అన్నారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా, చైనా, భారత్ కీలకం

అంతర్జాతీయ రాజకీయాలపై సీతారాం ఏచూరికి ముందుచూపు ఉందని కందారపు మురళి అన్నారు. రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన గతంలోనే విశ్లేషించారని గుర్తుచేశారు. నేటి అంతర్జాతీయ పరిణామాలు, బ్రిక్స్‌కు సంబంధించిన అభివృద్ధులు ఏచూరి విశ్లేషణలోని ముందుచూపును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం కోసం సీతారాం ఏచూరి సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. అన్వేష్, బి. మనోహర్, జి. శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి. చాంద్ బాషా, బి. దస్తగిరి రెడ్డి, కే. శ్రీనివాసులు రెడ్డి, ఎస్. గౌసియా బేగం, కే. సత్యనారాయణ, లక్ష్మీ రాజా తదితరులు పాల్గొన్నారు.

అలాగే ప్రజా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు ముంతాజ్ బేగం, శివరాంరెడ్డి, రవికుమార్, మహేష్ బాబు, కుమార్ స్వామి, రమణ, విజయ్, జకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, సత్తా నాయకులు కృష్ణ, వామపక్ష నాయకుడు రమణయ్యతో పాటు సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!