–కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం
సలాం ప్రొద్దుటూరు – కడప:
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులు, దళితులను లక్ష్యంగా చేసుకుని మత విద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.2014కు ముందు, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ముస్లింలపై వివక్షకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన కొందరు శక్తులు మతం పేరుతో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం అన్ని కులాలు, మతాలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మత విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తోందని అన్నారు.ముస్లింల ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మత విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.1992 బాబ్రీ మసీదు ఘటన, 2002 గుజరాత్ అల్లర్లు, ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఆయా ఘటనల్లో ముస్లింలు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. మతపరమైన హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇటీవల ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడి ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. మతం ఆధారంగా వివక్ష చూపడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.దేశంలో మత విద్వేషాన్ని పెంచే రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడాలని మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలకు కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
మత చిచ్చు పెట్టడమే కేంద్రం విధానమా?
కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. మతం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపడం సరికాదని అన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజుద్దీన్, డివిజన్ ప్రతినిధులు రహమతుల్లా ఖాన్, జహీర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
