ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బీసీల కోసం బలిదానం చేయాల్సి వస్తే.. రాచమల్లు ముందుంటారు..

బీసీల కోసం బలిదానం చేయాల్సి వస్తే.. రాచమల్లు ముందుంటారు..

📰 Generate e-Paper Clip

–బీసీల సమస్యలపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలి

 

– వైసీపీ బీసీ నేత రాగా నరసింహులు

 

సలాం ప్రొద్దుటూరు: 

 

బీసీల కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందువరుసలో ఉంటారని వైఎస్సార్‌సీపీ బీసీ నేత రాగా నరసింహులు అన్నారు. బీసీల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రొద్దుటూరులో నిర్వహించిన సమావేశంలో రాగా నరసింహులు మాట్లాడుతూ.. బీసీల పేరుతో సమావేశాలు నిర్వహించి, వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. ఏ బీసీ నాయకుడికి అన్యాయం జరిగినా మిగిలిన బీసీలందరికీ సమాచారం ఇచ్చి, వారిని కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.

“బీసీలకు నిజంగా అన్యాయం జరిగితే మేమంతా కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కూడా పిలవండి.. మేము వచ్చి పాల్గొంటాం. కానీ బీసీల పేరుతో విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు” అని అన్నారు.

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీసీల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సరికాదని రాగా నరసింహులు అన్నారు. బీసీలకు మున్సిపల్‌, ఎమ్మెల్యే తదితర ఎన్నికల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంపై అన్ని పార్టీలు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

చేనేత కార్మికుల సమస్యలపై కూడా బీసీ నాయకులు దృష్టి సారించాలని కోరారు. వేలాది మంది చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత భరోసా, పెన్షన్లు తదితర అంశాలపై కూడా కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బీసీల మధ్య చిన్నచిన్న విభేదాలను పెద్దవిగా చేసి, పరస్పరం దుర్భాషలాడుకోవడం వల్ల బీసీ సమాజానికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. “మన స్థాయి ఏమిటి.. మనం ఎలా మాట్లాడుతున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బీసీల గౌరవం, ఐక్యతను కాపాడుకోవాలి” అని సూచించారు.

బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు నాయకులు ముందుకు రావాలని రాగా నరసింహులు కోరారు. “బీసీల కోసం బలిదానం చేయాల్సి వస్తే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందుంటారు. బీసీల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి” అని అన్నారు.

బీసీల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు నిజమైన న్యాయం జరిగేలా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగితేనే బీసీ సమాజానికి గౌరవం, రాజకీయ బలం పెరుగుతుందని రాగా నరసింహులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!