–ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ భాస్కర్ కౌన్సెలింగ్..
–నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని స్పష్టం
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఆటోలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. పాత బస్టాండ్, శివాలయం సర్కిల్, అన్వర్ థియేటర్ తదితర ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ఆటోలను రోడ్డుకు అడ్డంగా నిలిపితే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లోనే ఆటోలను నిలిపివేయాలని సూచించారు.ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా ఎక్కడపడితే అక్కడ ఆటోలను పార్కింగ్ చేస్తే జరిమానాలతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమశిక్షణను కాపాడటంలో ఆటో డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు.
పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని డ్రైవర్ల విజ్ఞప్తి
ఆటో డ్రైవర్లు తమకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఐ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. పాత బస్టాండ్ ఆవరణలో ఆటోలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఐ.. సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
యూనిఫాం, పీసీ నంబర్లపై ప్రత్యేక సూచనలు
ప్రతి ఆటో డ్రైవర్ విధిగా ఖాకీ యూనిఫాం ధరించాలని, ఆటోలకు పీసీ నంబర్లు వేయించుకోవాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యతగా భావించాలని సీఐ భాస్కర్, ట్రాఫిక్ ఎస్సై భాస్కర్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో సురక్షితమైన, క్రమబద్ధమైన రవాణా వ్యవస్థకు సహకరించాలని కోరారు.ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
