–విద్యుత్ డీఈ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారుల ధర్నా
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలో నివాసం ఉంటున్న పేదలకు అమృతనగర్‌లో స్థలాలు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థలాల లబ్ధిదారులు ధర్నాలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు 15 ఏళ్ల క్రితం పేదలకు పట్టాలు ఇచ్చి అమృతనగర్‌లో స్థలాలు కేటాయించారని తెలిపారు. తమ సొంత డబ్బులతో పలువురు లబ్ధిదారులు బేస్‌మెంట్లు నిర్మించుకోవడంతో పాటు గోడల లెవల్ వరకు ఇళ్లు నిర్మించుకున్నారని చెప్పారు. కొందరు స్లాబ్‌లు కూడా వేసుకున్నప్పటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇళ్లలోకి చేరలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రొద్దుటూరు పట్టణంలో అద్దె ఇళ్లకు భారీగా అద్దెలు చెల్లించలేక పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అమృతనగర్‌లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తే సొంత ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటామని లబ్ధిదారులు చెబుతున్నారని తెలిపారు.ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అమృతనగర్ లేఅవుట్‌లో విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రొద్దుటూరు విద్యుత్ కార్యాలయం ఎదుట ప్రతిరోజూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.ధర్నాలో సీఐటీయూ కార్యదర్శి బి. విజయ్‌కుమార్, సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు బాబు, ఐద్వా ఉపాధ్యక్షురాలు పుష్పలతతో పాటు స్థలాల లబ్ధిదారులు రామలింగారెడ్డి, నాగేశ్వరరావు, సంజమ్మ తదితరులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

