ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే.. విధుల్లో నిర్లక్ష్యం సహించం

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే.. విధుల్లో నిర్లక్ష్యం సహించం

📰 Generate e-Paper Clip

 

ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వార్డు సచివాలయంలో సిబ్బంది ఉండాలి

 

–ఫిర్యాదులు స్వీకరించి వెంటనే నమోదు చేయాలి: కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందాలంటే వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ ఈ అంశంపై ప్రత్యేకంగా స్పందించారు.వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కీలకమైన వారధిగా పనిచేస్తోందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సేవలు, సంక్షేమ పథకాల సమాచారం, వివిధ పౌర సేవలను సులభంగా అందించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.వార్డు సచివాలయాల ద్వారా సుమారు 580 రకాల సేవలు ప్రజలకు అందుతున్నాయని, ముఖ్యంగా ‘వాట్సాప్ మిత్ర’ వంటి డిజిటల్ సేవల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే చేరడం పరిపాలనలో విప్లవాత్మక మార్పు అని కమిషనర్ అన్నారు.

 

ప్రజల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

 

ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించి People Positive Perception (PPP) పెంచేలా ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సిబ్బందికి ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ, ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా వార్డు సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించి, వాటిని విధిగా నమోదు చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.“ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం వారి ప్రాథమిక బాధ్యత. సేవల్లో నిర్లక్ష్యం లేదా ప్రజలకు అందుబాటులో లేకపోవడాన్ని సహించేది లేదు” అని కమిషనర్ స్పష్టం చేశారు.త్వరలో వార్డు సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రొద్దుటూరు పుర ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పౌర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!