–ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం.. నిర్మాణం వెంటనే ఆపాలి
–ప్రజల భద్రత కోసం ఎంతవరకైనా పోరాడుతాం
–కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా
సలాం ప్రొద్దుటూరు:
“అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం అంగీకరించం.. జనావాసాల మధ్య సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి”.. సబ్‌స్టేషన్ వద్దు.. ప్రజల ప్రాణాలకు ముప్పు!”– అంటూ ప్రొద్దుటూరు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసనగర్‌లో నిర్మిస్తున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంగళవారం ఆయన పరిశీలించి, స్థానిక ప్రజలతో కలిసి సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు.
జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో భారీ విద్యుత్ పరికరాలు, హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేయడం భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కేవలం 10 నుంచి 15 అడుగుల వెడల్పు ఉన్న ఇరుకైన రహదారులే ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు సైతం సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఉందన్నారు.
“ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు వారి మాట వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?” అని ఇర్ఫాన్ బాషా ప్రశ్నించారు.
స్టార్ టింబర్ అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసిన ఇర్ఫాన్
2016లో జరిగిన స్టార్ టింబర్ డిపో అగ్నిప్రమాదాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పట్లో అగ్నిమాపక వాహనాలను వివిధ ప్రాంతాల నుంచి రప్పించాల్సి వచ్చిందని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు రెండు రోజుల సమయం పట్టిందని గుర్తు చేశారు.
“అలాంటి ప్రమాదం జనావాసాల మధ్య నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌లో జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రాణనష్టం జరిగాక బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని అధికారులను నిలదీశారు.
ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టడం సరికాదు
స్థానిక ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఇర్ఫాన్ బాషా అన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో అమృత మహి ట్రస్ట్, బీసీ హాస్టల్, కూరగాయల మార్కెట్ తదితర ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
“స్థలం ఎంపిక విషయంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజలకు అవసరమైన సురక్షితమైన ప్రాంతంలో సబ్‌స్టేషన్ నిర్మించాలి. జనావాసాల మధ్య నిర్మాణాన్ని మాత్రం అంగీకరించం” అని స్పష్టం చేశారు.
అధికారులు ప్రజల ముందుకు రావాలి
రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే శ్రీనివాసనగర్‌కు వచ్చి ప్రజలతో సమావేశం నిర్వహించాలని ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. సబ్‌స్టేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు భావిస్తే, ప్రజల సమక్షంలో సాంకేతిక నిపుణులతో పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.
“ఇది ఇర్ఫాన్ బాషా వ్యక్తిగత సమస్య కాదు.. ఇది శ్రీనివాసనగర్ ప్రజల భద్రతకు సంబంధించిన సమస్య. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది” అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని నిలిపివేసి, అవసరమైతే ప్రత్యామ్నాయ సురక్షిత స్థలాన్ని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
