
–స్వచ్ఛ సంకల్ప దీక్షతో ప్రజల్లో చైతన్యం..
–10 వేల మందితో భారీ కార్యక్రమం…
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్ది ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల భాగస్వామ్యంతో నిరంతర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు’ అడ్వైజరీ కమిటీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం, పరిశుభ్రతను పెంపొందించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంపై చర్చించారు.ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా కార్యాచరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 15న అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో 10 వేల మందితో స్వచ్ఛ సంకల్ప దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, వ్యాపారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సమావేశంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ ముక్తియార్, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథం, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి కోనేటి ప్రదీప్‌రెడ్డి, జనసేన నాయకుడు సుంకర మురళి తదితరులు పాల్గొన్నారు.

