
–ఇంటింటికి టీడీపీలో ప్రజా సమస్యల సేకరణ..
–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం.. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు
సలాం ప్రొద్దుటూరు:
ప్రజల సమస్యలే ప్రభుత్వానికి ప్రాధాన్యమనే లక్ష్యంతో చేపట్టిన “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం ప్రొద్దుటూరు పట్టణంలోని 22వ వార్డులో ప్రజలకు ఆశాకిరణంగా మారింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు వార్డు ఇన్‌చార్జి బేపారి ఆరిఫ్ గత కొన్ని రోజులుగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు ప్రారంభించారు.
వార్డులో ఎదురవుతున్న సమస్యలను సమగ్రంగా నమోదు చేసి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేయగా, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ను కలిసి మరో వినతిపత్రం సమర్పించి వార్డులో నెలకొన్న సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వార్డులో సమస్యల వెల్లువ.. ప్రజల ఆవేదన
ఇంటింటికి పర్యటనలో ప్రజలు తమ సమస్యలను బేరిఫ్ ఆరిఫ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రోడ్లు లేకపోవడం, కాల్వల్లో పూడికలు తొలగించకపోవడం, మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లడం, దోమల విజృంభణ వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. పరిశుభ్రత లోపంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
జోక్‌పాలెం వీధికి సీసీ రోడ్డు, కాలువల కోసం విజ్ఞప్తి
జోక్‌పాలెం వీధివాసులు తమ ప్రాంతంలో సీసీ రోడ్డు, సీసీ కాలువ నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలువురు జారి పడిన ఘటనలను గుర్తుచేస్తూ వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
దోమలు, వీధికుక్కల బెడదతో ప్రజల్లో ఆందోళన
కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా దోమల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానికులు తెలిపారు. వార్డులో తరచూ ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు వీధికుక్కల బెడద కూడా రోజురోజుకూ పెరుగుతోందని, ఇటీవల ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలను తల్లిదండ్రులు వివరించారు. ముఖ్యంగా బలోబ్బిగారి వీధిలో కుక్కల సంచారం అధికమై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
స్ట్రీట్‌లైట్లు, తాగునీటి సమస్యలు కూడా వెలుగులోకి
పలు వీధుల్లో స్ట్రీట్‌లైట్లు లేక రాత్రివేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు చీకట్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. తాగునీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని, నిర్ణీత సమయాల్లో నీటిని విడుదల చేయాలని మహిళలు కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సహకారంతో సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని బేపారి ఆరిఫ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


