–7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
–₹3.50 లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసిన ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు మోటార్‌సైకిల్ చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి ₹3.50 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక ఏ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో
ఏఎస్పీ యు. విభు కృష్ణన్, ఐపీఎస్ వివరాలు వెల్లడించారు.
ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడు అయిన ప్రొద్దుటూరు పెన్నా నగర్ కు చెందిన సూర్య గురుతేజ ను అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద నుంచి ఏడు చోరీ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ 150, హీరో సీడీ డీలక్స్, హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా సీబీ షైన్, హోండా యాక్టివా-3జీతో పాటు ఒక చాసిస్, ఇంజిన్ నంబర్ల ఆధారంగా గుర్తించిన వాహనం కూడా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కేసును ఛేదించిన వన్‌టౌన్ సి ఐ , పోలీసు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు. మోటార్‌సైకిళ్లను భద్రంగా పార్క్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల ఉక్కుపాదం
–ఏడు నెలల్లో 3,344 కేసులు నమోదు.. రూ.8 లక్షల జరిమానా వసూలు
–డ్రంకెన్ డ్రైవింగ్, మైనర్ల డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి
ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేసినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) యు. విభు కృష్ణన్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మోటారు వాహనాల చట్టం (MV Act) కింద 3,344 కేసులు నమోదు చేసి రూ.8,00,245 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
అదే విధంగా టీఎన్ యాక్ట్ కింద 109 కేసులు నమోదు చేసి రూ.3,27,000 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదైన కేసుల్లో హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే డ్రంకెన్ డ్రైవింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు 57 కేసులు నమోదు చేసి రూ.3.27 లక్షల జరిమానా విధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు పెరిగినట్లు ఏఎస్పీ తెలిపారు.
ప్రత్యేకించి మైనర్ల చేత వాహనాలు నడిపించడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, అనధికారిక వాహన మోడిఫికేషన్లు వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, సురక్షితమైన ప్రయాణానికి సహకరించాలని ఏఎస్పీ యు. విభు కృష్ణన్ విజ్ఞప్తి చేశారు.

