–ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అంతర్జాతీయ విమానాశ్రయం
సలాం ప్రొద్దుటూరు (గజపతినగరం):
ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నేపథ్యంలో, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ బుధవారం విమానాశ్రయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వీఐపీ వసతులు, ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను అధికారులతో కలిసి సమీక్షించారు. ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు విశేష ప్రోత్సాహం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు, సమన్వయకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
