సలాం ప్రొద్దుటూరు:
గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై నిర్వహించిన గ్రామసభలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా నమోదు చేయించడమే ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.
మంగళవారం కొత్తపల్లి పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వ్యవస్థలకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు, బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పరిపాలన కొనసాగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ పాలన ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి సేవలు అందుతాయని వివరించారు.
ప్రజల్లో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కొందరు మున్సిపాలిటీలో విలీనానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు గ్రామ పంచాయతీగానే కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉందని, ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని సూచించారు.
భారత రాజ్యాంగం గ్రామీణ ప్రాంతాల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను, పట్టణ ప్రాంతాల కోసం మున్సిపల్ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తుచేసిన ఆయన, రెండు వ్యవస్థల్లోనూ ప్రయోజనాలు, సవాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. అభివృద్ధి అవకాశాలు, పరిపాలనా అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అవినీతి లేదా పరిపాలనా లోపాలు ఏ ఒక్క వ్యవస్థకే పరిమితం కావని, అవి వ్యక్తుల పనితీరుపై ఆధారపడి ఉంటాయని అన్నారు. అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను తెలుసుకుని ప్రజలు తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు గ్రామాల్లో ఉన్నత చదువులు చదివించుకోలేక పట్టణాలకు, విదేశాలకు వెళ్లి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వెళ్తున్నారన్నారు. పట్టణాల్లో మెరుగైన సేవలు ఉండడమే దీనికి ఉదాహరణ అన్నారు. పంచాయతీలు పట్టణాల్లో విలీనం అయితే మెరుగైన వసతులు సౌకర్యాలు నిధులు కావలసిన మౌలిక వసతులు ఎక్కువగా లభిస్తాయని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ, ప్రజల ప్రయోజనాలే ప్రామాణికంగా భావించి బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
