–సిఎస్ఐ ఎయిడెడ్ హైస్కూల్‌ను పరిరక్షించాలి.
–కలెక్టరేట్ పిజిఆర్ఎస్ లో డీఆర్వోకు సిపిఐ వినతి..
సలాం ప్రొద్దుటూరు ( కడప):
మయూరి బేకరీ యాజమాన్యం సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల ఆట స్థలం లో కట్టడాల లీజు ఒప్పందాలను రద్దు చేయాలని, ఎయిడెడ్ హైస్కూల్‌ను అన్ని విధాలుగా పరిరక్షించి, అభివృద్ధి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ డిమాండ్ చేశారు..సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లో జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు, జిల్లా విద్యాశాఖ అధికారి యస్ .శంషుద్దీన్ లకు సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ మాట్లాడుతూ 148 సంవత్సరాల చరిత్ర కలిగిన సి.ఎస్.ఐ ఎయిడెడ్ హైస్కూల్ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం, సంబంధిత యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.పాఠశాల ప్రాంగణంలోని స్థలాలను కమర్షియల్ లీజులకు ఇవ్వడం వల్ల విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ లీజులకు సంబంధించిన ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపి, మయూర బేకరీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శాశ్వత నియామకాలు జరిగే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. సీఎస్ఐ యాజమాన్యం నియమించలేకపోతే ప్రభుత్వమే నియమించి విద్యార్థులకు చదువు చెప్పించాలన్నారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ఆటస్థలం, ఇతర మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. ఈ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను బలోపేతం చేసే చర్యలను వెంటనే చేపట్టాలన్నారు.సి.ఎస్.ఐ ఎయిడెడ్ హైస్కూల్ ఆస్తులను విద్యా అవసరాలకే వినియోగిస్తూ, పాఠశాలను పరిరక్షించి అభివృద్ధి చేయాలన్నారు. అడ్డగోలుగా నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు సంబంధించిన మెటీరియల్ ఇసుక ,సిమెంటు, ఇనుప కడ్డీలు తదితర సామాగ్రి సిఎస్ఐ స్కూలు తరగతుల వద్ద ఆఫీస్ రూమ్ వద్ద, దారిలో, ఆట స్థలాల్లో విచ్చలవిడిగా స్కూలు వాతావరణానికి విద్యార్థులకు అడ్డంకిగా ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలన్నారు. సిఎస్ఐ స్కూల్ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, లేకపోతే ప్రజా ఉద్యమంగా మారుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు యేసు రత్నం, భాగ్యలక్ష్మి, వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడు సిఎస్ఐ స్కూల్ పరిరక్షణ సమితి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
