సలాం ప్రొద్దుటూరు:
తాలీమ్-ఏ-హునార్ పథకం కింద నిర్వహించిన ప్రతిభా పరీక్షలో ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపికైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, జిల్లా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, ప్రతిభ ఆధారంగా 250 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముస్లిం విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 25 మంది విద్యార్థులు ఎంపిక కాగా, ప్రొద్దుటూరు నుంచి 9 మంది ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎంపికైన విద్యార్థులకు మొమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పథకం అమలుకు కృషి చేస్తున్న వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ కుటుంబాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
