సలాం ప్రొద్దుటూరు:
తమిళనాడులో ఇటీవల విద్యాశాఖ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా.. ప్రతి ప్రైవేట్ స్కూల్ తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులపై, వెబ్‌సైట్లలో బహిరంగంగా ప్రదర్శించాలంటూ తమిళనాడు విద్యాశాఖ జూన్ మొదటి వారంలో కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సీఎం విజయ్ ప్రభుత్వ విద్యా సంస్కరణల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లు
ఈ నేపథ్యంలో.. “ఇలాంటి బోర్డులు మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయా?” అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఏపీలో కార్పొరేట్ విద్యాసంస్థల ‘రాజకీయం’
తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలే పాలకుల పాత్ర పోషిస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని పెద్ద విద్యాసంస్థల యజమానులే ఇక్కడ అధికార పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా, లోక్‌సభ ఎంపీలుగా, కీలక మంత్రులుగా చలామణి అవుతున్నారు. విద్యా వ్యవస్థను నడిపించే శక్తులే నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు, వారి వ్యాపార ప్రయోజనాలకు గండి కొట్టేలా ఫీజుల నియంత్రణ జరుగుతుందా? అన్నది సామాన్యుడి సందేహం.పొరుగు రాష్ట్రంలో సీఎం విజయ్ ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడానికి సాహసోపేతమైన అడుగులు వేస్తుంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెచ్చే సాహసం చేస్తుందా అంటే.. ఒకవేళ అలా చేస్తే సొంత పార్టీలోని పారిశ్రామికవేత్తలు, మంత్రుల నుంచే తీవ్ర వ్యతిరేకత తప్పదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
