–త్వరలో రోజుకు లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం
–జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
సలాం ప్రొద్దుటూరు (కడప):
జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలవడం జిల్లాకే గర్వకారణం అని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సభాభవనంలో.. స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పురోగతి, వివిధ దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ తో పాటు.. జేసీ డా. నిధిమీనా, సబ్ కలెక్టర్ భావన, స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి జోయెల్ విజయకుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ అనురాధ, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తే ఎంతటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించిందని తెలిపారు. మహిళల సమర్థ నిర్వహణతో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహారం సకాలంలో అందుతోందని పేర్కొన్నారు.
స్మార్ట్ కిచెన్‌లో తయారవుతున్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. అందుతున్న సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ఏర్పాటైన కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా, రెండో దశలోని కేంద్రాలు విస్తరణ దశలో, మూడో దశలోని కేంద్రాల్లో ట్రయల్ రన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని, నాలుగో దశలో మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు.
శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు, విద్యుత్, తాగునీరు, గ్యాస్ బ్యాంకులు, సౌర విద్యుత్ వ్యవస్థలు, ఇంటర్నెట్ సదుపాయం, ఆహార భద్రత ధ్రువపత్రాలు, సిబ్బంది నియామకం, వాహనాల ఏర్పాటు, శిక్షణ తదితర అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యార్థికి కూడా భోజన ప్లేట్ యూనిక్ గా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ అంశాలన్నింట్లో కూడా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
త్వరలో జిల్లాలో ప్రతిరోజూ సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దేశంలోనే ఏ సంస్థ అమలు చేయని స్థాయిలో అత్యాధునిక సాంకేతికత, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థ, నాణ్యత ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి స్మార్ట్ కిచెన్ వ్యవస్థను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీఎస్‌పురం మండల మహిళా సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, కిచెన్ మేనేజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
