— రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్
–ప్రభుత్వ విద్యను కాపాడండి…
సలాం ప్రొద్దుటూరు (రాయచోటి):
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) ఆధ్వర్యంలో రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్ ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండం నాటి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేవు తీవ్ర ఇబ్బందులు ప్రభుత్వం విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
విద్యాసంస్థల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల పరిసరాలను మద్యం రహిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు రాయచోటి నియోజకవర్గం అధ్యక్షుడు ఈశ్వర్, నాయకులు బాదుల్లా, సమీర్, కృష్ణ, వంశీ, రెడ్డి భాషా తదితరులు పాల్గొన్నారు.
