–క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత నాది
సలాం ప్రొద్దుటూరు:
సీనియర్ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలనీ తెలుగు దేశం నాయకులు , కార్యకర్తలు, అభిమానుల కు బుధవారం ప్రొద్దుటూరు లో జరిగిన సభ లో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఈ నియోజకవర్గంలో అనేకమంది నేతలు తన తో కలసి నడిచారనీ వారందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరద పై ఉందనీ చెప్పారు. పార్టీలో వర్గాలు ఉండకూడదనీ, వర్గాల వల్ల పార్టీ నష్టపోతుందనీ,నాయకులు పార్టీని నమ్మి పనిచేయలని, వారికి సరైన స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటానీ ప్రకటించారు. కష్టపడిన నాయకులను గుర్తించేందుకే మై టిడిపి యాప్ తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసే 4లక్షలమంది నాయకుల పనితీరును అంచనా వేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఏ కార్యక్రమం చేసినా మై టిడిపి యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురావాలని,పదవులు వాటంతట అవే వెదుక్కుంటూ వస్తాయన్నారు. నామినేటెడ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియను చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారనీ వివరించారు. తొలివిడతలో అవకాశం రానివారికి మరోవిడతలో వస్తుందనీ, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత తన దనీ హామీ ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాల అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు నడిపిస్తున్నాం అన్నారు. ఈనెల 24వతేదీన రెండోవిడత తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నాం అని వివరించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.4వేల పెన్షన్ అందజేస్తున్నాం అని,దీపం-2 పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు, చేనేతలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం అని వివరించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వని అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేశాం అన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు 16వేల టీచర్ పోస్టులు, 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేశాం. 10వేల పోస్టులతో జాబ్ క్యాలండర్ ప్రకటించాం అన్నారు. ఒకవైపు గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరోవైపు సంక్షేమాన్ని పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నాం అన్నారు. వైసిపి హయాంలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వంలో ట్రూడౌన్ చేసి తగ్గించాం, చెత్తపై పన్ను వంటి వాటిని తొలగించాం అన్నారు. 60వేలకోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయిలో అందజేస్తున్నాం అన్నారు. మరో ఏడాది కష్టపడితే ఆర్థిక సమస్యలను అధిగమిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉందన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు పార్టీల కలయిక
కేవలం రాష్ట్రాభివృద్ధే ఏకైక ఎజెండాగా టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఒకరి పేరుతో మరొకరిని ఉసిగొల్పేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి రెచ్చగొట్టేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్ ప్రయత్నిస్తారనీ హెచ్చరించారు. కూటమి కేడర్ అప్రమత్తంగా, ఐక్యంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలనీ పిలుపు ఇచ్చారు. ఎట్టి పరిస్థితులు ఎదురైనా దీర్ఘకాలం కూటమి కొనసాగుతుందన్నారు.రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోడీజీ అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారన్నారు.విశాఖ స్టీల్ కు నిధులు, రైల్వే జోన్, బిపిసిఎల్ వంటి భారీ ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇచ్చారనీ, కేంద్రం సహకారంతోనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం అన్నారు. కార్యకర్తలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో మాదిరిగానే పనిచేయలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్, ప్రతి ఓటు మనకు కీలకమే అన్నారు. భారీ మెజారిటీతో నెగ్గిన మంగళగిరిలో కూడా 20 బూత్ లలో మైనస్ వచ్చిందనీ గుర్తు చేశారు. ప్రజలతో బంధాన్ని ఏర్పాటుచేసుకొని మమేకమై ముందుకు సాగాలని యువనేత లోకేష్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
