సలాం ప్రొద్దుటూరు (కలికిరి):
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా, కలికిరి ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (టి. చదివేవాండ్లపల్లి) 9వ తరగతి విద్యార్థులు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ డాక్టర్ కె. మంజుల విద్యార్థులకు కేంద్రం ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.వానపాముల ఎరువు తయారీ విధానం, అందులో ఉండే స్థూల, సూక్ష్మ పోషకాలు, వివిధ పంటల్లో వాటి వినియోగం గురించి ఆమె వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో వరి సాగులో పశువుల ఎరువు, అజోస్పిరిల్లం, పీఎస్బీ, కేఎస్బీ వంటి జీవన ఎరువులను వినియోగించి నాణ్యమైన దిగుబడులు సాధించినట్లు తెలిపారు. ఈ సేంద్రియ సాగు విధానాలను జిల్లాలోని రైతులు అనుసరించి లాభాలు పొందేలా కెవికే శాస్త్రవేత్తలు వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా మార్గదర్శనం చేస్తున్నట్లు చెప్పారు.అనంతరం శాస్త్రవేత్తలు వర్మీ కంపోస్ట్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, షేడ్ నెట్, అజోల్లా యూనిట్, కస్టమ్ హైరింగ్ సెంటర్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను విద్యార్థులకు చూపించి వాటి ఉపయోగాలను వివరించారు.గైడ్ టీచర్ జానం సుజాత మాట్లాడుతూ, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు డాక్టర్ కె. మాధురి, డాక్టర్ వై. పీరుసాహెబ్, ఎస్. సోమశేఖర్ బాబు, సి. శరత్ కుమార్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ రమణతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
