ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeతెలంగాణఆదిలాబాద్కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • ఒకే రోజు, ఏకకాలంలో 8వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు
  • ఆదిలాబాదు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుండి హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అధికారులు

ఆదిలాబాదు జిల్లా   :  రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” మహిళా వారోత్సవాల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు గ్రామ సంఘ భవనాల (ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలు) భూమి పూజ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.అనసూయ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్ధిల్లా శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 8వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపనలు చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ భవనాలు మహిళా సంఘాల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలిపారు. రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.60,470 కోట్ల రుణాలు అందించామని, దీని ద్వారా సుమారు 5 లక్షల మంది మహిళలు వ్యాపారవేత్తలుగా మారారని సీఎం వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, వారిని బస్సుల యజమానులుగా కూడా తీర్చిదిద్దామని అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.

 

హైదరాబాద్ నుండి సీఎం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఇతర జిల్లా అధికారులు మరియు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి, వారి ఆర్థికాభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచించిన విధంగా మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, వివిధ మండలాల మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!