ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

 

 

–ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే దీక్ష

 

సలాం ప్రొద్దుటూరు:

 

మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ప్రొద్దుటూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు రిలే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చంటి, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి

 

మరణించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, వారి కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించడం లేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

 

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి

 

ఆప్కాస్ కార్మికులు 60 సంవత్సరాల వయస్సు నిండగానే ఎలాంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు లేకుండా విధుల నుంచి తొలగించబడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. పదవీ విరమణ పొందే కార్మికులకు రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, నెలకు రూ.10 వేల పింఛన్ మంజూరు చేయాలని, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఆప్కాస్ కార్మికుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు కొనసాగించాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

12వ పీఆర్సీ అమలు చేయాలి

 

ఆప్కాస్ కార్మికులకు 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) అమలు చేసి జీతాలు పెంచాలని, కార్మికులపై అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను రద్దు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అర్హులైన కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.

 

కోవిడ్ కార్మికులకు రూ.18,500 వేతనం చెల్లించాలి

 

కోవిడ్ సమయంలో విధుల్లో చేరిన కార్మికులకు ఎస్‌ఎస్‌ రేట్ల ప్రకారం, కలెక్టర్ ఆదేశాల మేరకు నెలకు రూ.18,500 వేతనం చెల్లించి, వారిని ఆప్కాస్‌లో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, కడప తదితర ప్రాంతాల్లో కోవిడ్ కార్మికుల వేతనాలు పెంచుతున్నప్పటికీ, ప్రొద్దుటూరులో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి, కలెక్టర్, మంత్రుల కార్యక్రమాలు, వరద సహాయక చర్యలు, మున్సిపాలిటీకి అవార్డులు సాధించే కార్యక్రమాల్లో కార్మికులతో విస్తృతంగా పనులు చేయించుకుంటున్నారని, అయితే వారి వేతనాల పెంపు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. చిన్న మున్సిపాలిటీల్లో సైతం వేతనాలు పెంచుతున్నప్పుడు, ప్రొద్దుటూరులో కార్మికులకు అన్యాయం జరగడం తగదన్నారు. అధికారులు ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టివేస్తూ నిధులు లేవని చెప్పడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

 

కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

 

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే కార్మికుల ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ రిలే దీక్షలో మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, అధ్యక్షుడు చంటి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ కమిటీ సభ్యులు నీతిమ్మ, ప్రమీలమ్మ, గుర్రప్ప, మోహన్, ఇంజనీరింగ్ విభాగ కార్మికుడు బాలాజీతో పాటు మున్సిపల్, కోవిడ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!