–పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశానిర్దేశం
సలాం ప్రొద్దుటూరు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరులో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా చర్యలు, బందోబస్తు విధులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పర్యటన మార్గంలో భద్రత తదితర అంశాలపై శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. పర్యటన మార్గం, సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, వీఐపీ ప్రవేశ ద్వారాలు, ప్రజల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని, భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. విధుల్లో పరస్పర సమన్వయం, క్రమశిక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ప్రాంతాలపై ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు.వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విబుకృష్ణ, ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్‌తో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

