–దేశ సమగ్రత, రక్షణ కోసం యువత ముందుకు రావాలి
–ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ భాషా
సలాం ప్రొద్దుటూరు జమ్మలమడుగు:
దేశ సమగ్రతను కాపాడుకోవడంతో పాటు దేశ రక్షణ కోసం నేటి జెన్‌జీ విద్యార్థులు, యువత ముందుకు రావాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ భాషా పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్‌సింగ్ జీవితం, త్యాగం, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక షిరిడీ సాయి జూనియర్ కళాశాలలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఖాదర్ భాషా మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అత్యంత చిన్న వయసులోనే ప్రాణత్యాగానికి సిద్ధమైన భగత్‌సింగ్ త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.భగత్‌సింగ్ దేశభక్తి, ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తిని ప్రతి విద్యార్థి, యువత తెలుసుకోవాలని అన్నారు. నేటి జెన్‌జీ యువత దేశ సమగ్రత, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో చైతన్యవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.విద్యార్థి ఉద్యమాల్లో భగత్‌సింగ్ ఆలోచనలు, పోరాట స్ఫూర్తి నేటికీ ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత విద్యతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మోహన్, మధు, బాబయ్య, దస్తగిరి, చరణ్, పవన్ నాగతేజ, చరణ్‌కుమార్, సాయి, రాజ్‌దీప్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
