ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి...!

ప్రొద్దుటూరు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి…!

📰 Generate e-Paper Clip

–ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

 

–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,జేసీ డా. నిధీమీనా  హాజరు

 

–రహదారులు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్‌ దీపాలు, గ్రామీణ అనుసంధాన రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం

సలాం ప్రొద్దుటూరు – కడప:

వాణిజ్యపరంగా కీలకమైన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ డా.శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు.మంగళవారం సాయంత్రం కడప కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జేసీ డా.నిధిమీనా ,ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి  హాజరయ్యారు.ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…పట్టణంతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రహదారులు,భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ,తాగునీరు,విద్యుత్‌ దీపాలు,పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు పట్టణాన్ని పరిసర గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణం,మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాల ఏర్పాటును పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు.పట్టణ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

 

భూగర్భ డ్రైనేజీకి అత్యంత ప్రాధాన్యం..

 

ప్రొద్దుటూరు పట్టణంలో ఎప్పటినుంచో ఉన్న మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునిక సాంకేతిక విధానాలతో చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. సుమారు రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో పాటు 24 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.కొత్తపల్లె ప్రాంతంలో శుద్ధి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి,సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పట్టణ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి పారుదల వ్యవస్థను శాస్త్రీయంగా రూపొందించాలని సూచించారు.

 

మున్సిపల్ కార్మికులు ఎఫ్.ఆర్.ఎస్. అమలు చేయాలి..

పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపాలిటీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.పారిశుధ్య కార్మికుల హాజరుకు విధిగా ఎఫ్.ఆర్.ఎస్. విధానాన్ని అమలు చేయాలన్నారు.పారిశుధ్య కార్మికులకు అందే ప్రతీ పేమెంట్స్ కూడా ఎఫ్.ఆర్.ఎస్. నమోదు ద్వారానే జరగాలన్నారు

 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అవగాహన పెంపొందించాలి..

 

పట్టణ విస్తరణ,కొత్త నిర్మాణాలు,లేఅవుట్ల అభివృద్ధి నేపథ్యంలో టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు.ఈ సదస్సులో లేఅవుట్ల అనుమతులు,భవన నిర్మాణ అనుమతులు,రహదారుల ఏర్పాటు,ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన స్థలాలు,పార్కులు,మౌలిక వసతుల కల్పనతో పాటు పట్టణ ప్రణాళిక నిబంధనలపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు.నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని,భవిష్యత్‌లో పట్టణ ప్రణాళికకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

హోసింగ్ శాఖలో ఆరోపణలపై సమగ్ర విచారణ..

 

ప్రొద్దుటూరులో గతంలో పేదలకు మంజూరైన ప్రభుత్వ గృహాల నిర్మాణంలో ఆప్షన్‌–1, 2 నిర్మాణాల ఎంపికతో పాటు ఆప్షన్‌–3 కేటాయింపుల్లో కాంట్రాక్టర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు,అభ్యంతరాలపై జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి స్పందించారు.ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని,హౌసింగ్‌ శాఖతో పాటు ప్రైవేటు ఏజెన్సీలకు సంబంధించి అందిన ఫిర్యాదులు,అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.విజిలెన్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.అదే సమయంలో నూతన గృహ నిర్మాణ విధానం ప్రకారం ఇప్పటివరకు ఇళ్లు మంజూరు కాని అర్హులందరినీ గుర్తించి ఇంటి పట్టాలు,గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.అనర్హులను జాబితా నుంచి తొలగించి,అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ సదుపాయం ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

తాగునీటి సరఫరా మెరుగుపరచాలి..

 

మైలవరం జలాశయం నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సరఫరా,నీటి నిల్వ కేంద్రాలు,పంపిణీ పైపులైన్ల పరిస్థితిపై కలెక్టర్‌ సమీక్షిస్తూ… అమృత్‌ పథకం కింద చేపట్టిన తాగునీటి పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని,భవిష్యత్‌ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

 

పరిశ్రమలు,ఉపాధి అవకాశాలపై దృష్టి…

 

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.చౌడూరు వద్ద ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పార్కులో ఖాళీగా ఉన్న స్థలాలను పారిశ్రామికవేత్తలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు.

 

గ్రామీణ ప్రాంతాలకూ సమాన ప్రాధాన్యం..

 

పట్టణంతో పాటు ప్రొద్దుటూరు,రాజుపాలెం మండలాల పరిధిలోని గ్రామాల్లో రహదారులు,తాగునీరు,సాగునీరు, విద్యుత్‌,పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కలెక్టర్‌ ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాలను పట్టణంతో అనుసంధానించే రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని,ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

 

ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని,పెండింగ్‌లో ఉన్న భూసేకరణ,అనుమతులు,ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ప్రొద్దుటూరు పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసి,పరిసర గ్రామాలతో సమగ్ర అనుసంధానం కలిగిన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

 

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ…నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు సలహాలు,సూచనలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో రహదారులు,భూగర్భ డ్రైనేజీ,తాగునీరు,విద్యుత్‌ దీపాలు,పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు.పెండింగ్‌ సమస్యలను త్వరగా పరిష్కరించి,పట్టణం-గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి అవసరమైన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు పేదల గృహ నిర్మాణం,సాగునీరు, విద్య,వైద్యం,ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో శిరీష,ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్,తహశీల్దార్ ఉదయ్ భాస్కర్,టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణసింగ్,అన్నిశాఖల జిల్లాస్థాయి,డివిజనల్, నియోజకవర్గ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!