ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్జీవో-396తో దస్తావేజు లేఖరుల ఉపాధిపై వేటు..! ప్రజల ఆస్తుల భద్రతకూ ముప్పు..రాచమల్లు

జీవో-396తో దస్తావేజు లేఖరుల ఉపాధిపై వేటు..! ప్రజల ఆస్తుల భద్రతకూ ముప్పు..రాచమల్లు

📰 Generate e-Paper Clip

–జీవోను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

 

 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396 దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆస్తుల భద్రత, వ్యక్తిగత సమాచార గోప్యతను కూడా ప్రమాదంలోకి నెడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించిన ఆయన, ఈ పోరాటం కేవలం ఒక వృత్తి వర్గానికే పరిమితం కాదని, రాష్ట్ర ప్రజల హక్కులు, ఆస్తుల రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోందని రాచమల్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ, విద్య, వైద్యం, ప్రభుత్వ ఆస్పత్రులు, విశాఖ ఉక్కు కర్మాగారం, సంక్షేమ పథకాలు, గ్యాస్ పంపిణీ వంటి రంగాల తర్వాత ఇప్పుడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలనే ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు.

దస్తావేజు లేఖరులు ప్రజలకు చట్టపరమైన మార్గదర్శకత్వం అందిస్తారు

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పనిచేసే దస్తావేజు లేఖరులు కేవలం స్టాంపులు రాసే వ్యక్తులు మాత్రమే కాదని, భూముల కొనుగోలు, విక్రయాల్లో ప్రజలకు చట్టపరమైన మార్గదర్శకత్వం అందించే అనుభవజ్ఞులని రాచమల్లు పేర్కొన్నారు. ఈసీ పరిశీలన, అసైన్డ్ భూముల వివరాలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. అలాంటి వేలాది మంది కుటుంబాల జీవనోపాధిని ఒక్క జీవోతో ప్రమాదంలోకి నెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

5 లక్షల మందికి 25 లక్షల వైఎస్ఆర్ సీపీ నాయకులు అండగా ఉంటాం

రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన, జీవో-396తో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్కువ ఆదాయంతో కుటుంబాలను పోషిస్తున్న ఈ వర్గంపై ప్రభుత్వం ఉపాధి వేటు వేసిందని ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది దస్తావేజు లేఖరుల కు  25 లక్షల వైఎస్ఆర్ సీపీ నాయకులు  కార్యకర్తలు  అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.జీవో-396లో భాగంగా ప్రవేశపెట్టిన “ఫ్రంట్ ఆఫీస్–బ్యాక్ ఆఫీస్” విధానాన్ని రాచమల్లు తీవ్రంగా తప్పుబట్టారు. కార్పొరేట్ సంస్థల ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు అందించడం వల్ల ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదని, రాష్ట్ర ప్రజల ఆస్తుల భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని హెచ్చరించారు.భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం, ఆస్తుల విలువ, యాజమాన్య వివరాలు రాజకీయ అనుబంధాలు ఉన్న వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే భూ కబ్జాలు, అక్రమాలు, మోసాలకు అవకాశం పెరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగి, తమ ఆస్తుల వివరాలు ఎవరి వద్ద ఉంటాయో అనే అనుమానం నెలకొంటుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ విలువల విషయంలో కూడా అధికారుల ఇష్టానుసారం మార్కెట్ విలువ లేదా రిజిస్ట్రేషన్ విలువను అమలు చేసే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.ప్రభుత్వ వ్యవస్థకు, ప్రైవేటీకరణకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రాచమల్లు చేసిన వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి. “ప్రభుత్వ వ్యవస్థ తల్లి పాలలాంటిది. ప్రైవేటీకరణ బుడ్డిపాల లాంటిది. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు సంరక్షకుడిగా ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యవస్థ లాభాల కోసమే పనిచేస్తుంది. ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే తప్ప కార్పొరేట్ సంస్థలది కాదు” అని ఆయన అన్నారు.జీవో-396ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాచమల్లు, ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. దస్తావేజు లేఖరుల హక్కుల పరిరక్షణతో పాటు రాష్ట్ర ప్రజల ఆస్తుల భద్రత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!