
–సామూహిక గీతా పారాయణంతో ఆధ్యాత్మిక సందడి
– జానపద, భరతనాట్య ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు
సలాం ప్రొద్దుటూరు:
స్థానిక శ్రీ కృష్ణ గీతాశ్రమంలో నామ ఎరుకలయ్య, కమలాక్షుమ్మ ఆరాధన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణునితో పాటు ఎరుకలయ్య, కమలాక్షుమ్మ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు.
లోక కళ్యాణం, సకల మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ భక్తులందరూ సామూహికంగా భగవద్గీత పారాయణం నిర్వహించారు. గీతా శ్లోకాల పఠనంతో ఆశ్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఆకట్టుకున్న జానపద, భరతనాట్య ప్రదర్శనలు
మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం నటరాజ కళాక్షేత్రం నాట్యగురువు మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందంలోని విద్యార్థులు జానపద, భరతనాట్య ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు అద్భుతమైన నృత్య నైపుణ్యంతో ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్యరీతులు, కళాత్మక అభినయంతో విద్యార్థులు అందరి ప్రశంసలు అందుకున్నారు.భక్తి, ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ ఆరాధన మహోత్సవాలు భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

