–గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు..
–కలెక్టర్, పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు
సలాం ప్రొద్దుటూరు:
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఓటు హక్కులను అధికార బలంతో అణచివేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామస్థాయి ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రతినిధులను ఎన్నుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని, అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు, ఎన్నికల యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోందని ఆయన విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.15 గ్రామపంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల అభిప్రాయాన్ని ఓటు ద్వారా ప్రతిబింబించేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించాయని, అయితే నామినేషన్ల సమయంలో అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు, అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు సైతం ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. చివరకు 4 గ్రామాల్లో మాత్రమే తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు.పోలింగ్ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలను ప్రభావితం చేయడం, ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడటం, ఎన్నికల అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, స్థానిక పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజల ఓటుతో ఎన్నికైనప్పుడే సర్పంచ్ పదవికి నిజమైన గౌరవం ఉంటుంది అని రాచమల్లు పేర్కొన్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరించడం, అధికార బలంతో పదవులు దక్కించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ వంటి స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో ప్రజలే నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎదురైన అవమానాలు, ఒత్తిళ్లకు అధైర్యపడవద్దని, ఆవేశానికి లోనై హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రజలతో మమేకమై శాంతియుతంగా రాజకీయ పోరాటం కొనసాగించాలని కోరారు. నామినేషన్ల దశలో ధైర్యంగా ముందుకొచ్చిన పార్టీ శ్రేణులను అభినందించారు.అధికారంలో ఉన్నవారు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని, భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీలకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. 2029లో ప్రజల తీర్పుతో సమాధానం చెబుతాం అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, గ్రామాల్లో ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
