–అఖిల భారత కూచిపూడి నృత్య పోటీల్లో తృతీయ స్థానం కైవసం
సలాం ప్రొద్దుటూరు:
భారతీయ సంప్రదాయ కళ అయిన కూచిపూడి నృత్యంలో తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ప్రొద్దుటూరుకు చెందిన కె. శ్రియారెడ్డి జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత 25వ దేశవ్యాప్త సాంస్కృతిక నృత్య పోటీల్లో కూచిపూడి సోలో సీనియర్ విభాగంలో తృతీయ స్థానం సాధించి విజేతగా నిలిచారు.
నవంబర్ 18, 2026న హైదరాబాద్లోని బషీర్బాగ్ భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఈ ప్రతిష్ఠాత్మక నృత్య పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న కళాకారుల మధ్య జరిగిన పోటీల్లో శ్రియారెడ్డి తన నృత్య నైపుణ్యం, అభినయ చాతుర్యం, లయబద్ధమైన ప్రదర్శనతో ప్రతిభను చాటుకుని మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని వై.ఎం.ఆర్. కాలనీకి చెందిన గండ్లూరు వీర ప్రతాప్ రెడ్డి మనవరాలైన శ్రియారెడ్డి జాతీయ స్థాయి వేదికపై కూచిపూడి నృత్యంలో విజయం సాధించడం కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆమె సాధించిన ఈ ఘనతతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కూచిపూడి నృత్య కళను అభ్యసిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన శ్రియారెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రొద్దుటూరుకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

