–పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
– పోలీసు సిబ్బందికి కీలక ఆదేశాలు
సలాం ప్రొద్దుటూరు – కడప:
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.సిద్దవటం మండలం భాకరాపేటతో పాటు అట్లూరు, బయనపల్లి, గోపవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అప్రమత్తంగా ఉండాలి.. విధుల్లో నిర్లక్ష్యం వద్దు!
పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణ్, సిద్దవటం ఎస్‌ఐ హారిక, అట్లూరు ఎస్‌ఐ మోహన్ కుమార్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

